న్యూఢిల్లీ: టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌కు గతంలో భారత్ భారీ షాక్ ఇచ్చి టిక్ టాక్ ను దేశంలో బ్యాన్ చేసింది. తాజాగా భారత్ నుండి బైట్ డ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. భారత్ లో ఉన్న బైట్‌డ్యాన్స్ బ్యాంకు ఖాతాలను పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా తాజాగా ప్రభుత్వ అధికారులు స్తంభింపజేశారు.
సదరు బైట్‌డ్యాన్స్ కంపెనీ మాత్రం ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ నిర్ణయం తీసుకున్న ఉత్తర్వులను రద్దు చేసే ఆదేశాలు ఇవ్వాలని కంపెని కోర్టును ఆశ్రయించింది. క్రితం సంవత్సరం భారత్, చైనాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో దేశ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం టిక్‌టాక్ పై నిషేధం విధించింది.
చైనాకు సంబంధించిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించిన తర్వాత జనవరిలో బైట్‌డాన్స్ భారత ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించింది. కాగా, చైనా యాప్స్ విషయంలో భారతదేశం తీసుకున్న చర్యను చైనా పదేపదే విమర్శిస్తూ, ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధమని పలుకుతోంది.
బైట్‌డాన్స్ కంపెనీకి భారత్ లో సుమారు 1,300 మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్యకలాపాలకు సేవలు అందిస్తున్న వారే ఎక్కువ ఉన్నారు. కాగా మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలోని రెండు బైట్‌డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్‌డాన్స్ యూనిట్, సింగపూర్‌లోని దాని మాతృ సంస్థ టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్‌లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్‌డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు.