బెంగళూరు : తన కుమారుడి పేరిట వచ్చిన కొరియర్ బాక్స్‌లో ఉన్నది గంజాయని తెలిసి షాక్ తిన్నాడో తండ్రి. పిల్లాడి జీవితం పాడవకూడదన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించి, గంజాయి పంపిన వ్యక్తిని జైల్లోకి నెట్టించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు, బెంగళూరు, సదాశివనగర్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పిల్లాడి పేరిట ఓ కొరియర్ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరిచి చూశాడు. దాంట్లో గోధుమ రంగులో ఉన్న పొడి కనిపించింది. అనుమానం వచ్చిన ఆ వ్యాపార వేత్త వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. అనంతరం సదరు స్నేహితుడికి ఆ పొడిని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపాడు.
దాన్ని గంజాయి పొడిగా గుర్తించాడు, దీంతో ఆందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ పార్శిల్ ఎమ్‌జీ రోడ్ నుంచి వచ్చిందని గుర్తించారు. ఆ వ్యాపార వేత్త కొరియర్ ఆఫీసుకు వెళ్లి కొరియర్ పంపిన వ్యక్తి వివరాలు అడగగా వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 21న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పార్శిల్ పంపిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.