న్యూఢిల్లీ: క్యాప్ జెమిని, ఫ్రాన్స్‌కు చెందిన ఈ భారీ ప్రముఖ ఐటీ కంపెనీ ఈ సంవత్సరం భారతదేశంలో భారీగా ఉద్యోగులను నియమించుకోబోతోంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు.
ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా ఇందులో అవకాశం కల్పించబోతున్నట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాళజీస్, 5జీ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి పలు అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో ఈ తాజా నియమాకలను చేపడతున్నామన్నారు. కాగా ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్‌కు భారీ డిమాండ్ పెరిగి తమ వ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు.
గడచిన డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనా నుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారం తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు తెలిపారు.
ఇంకా ఏప్రిల్ 2020 లో, కరోనా మహమ్మారి పీక్ సమయంలో ఉన్నప్పుడు కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్న గత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి.
ఐటీ కంపెనీలలో మేజర్ అయిన ఇన్ఫోసిస్ కూడా 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ.