అమరావతి: రాష్ట్ర రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని విషయమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని విషయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తన కౌంటర్‌లో చాలా స్పష్టంగా తెలిపిందని గుర్తుచేసింది. రాజధానితో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పేర్కొంది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఇవి అమల్లో ఉండగా కార్యాలయాలను ఎక్కడికీ తరలించరాదని పిటిషనర్ కోరడం న్యాయసమ్మతం కాదని తన నివేదనలో తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకుండా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన కౌంటర్ వేసింది. ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు, బెంచ్‌లు ఎక్కడ ఉండాలన్న విషయం పునర్విభజన చట్టం, వికేంద్రీకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర వర్సెస్ నారాయణ శ్యాంరాం పురాణిక్ కేసులో సుప్రీంకోర్టు 1982లో చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలుపరిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము విడిచిపెట్టలేదని, ప్రతీ సమావేశంలోనూ, పార్లమెంట్‌లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని కోర్టుకు తెలిపింది.