న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అతలాకుతలమైన 2020లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గడం కీడులో కలిసొచ్చిన మేలుగా భావించవచ్చు. 2019లో ఈ సమయంలో వాతావరణంలో ఉద్గారాలతో 2020లో ఇదే సమయానికి ప్రపంచ వాతావరణంలో ఉన్న కర్బన ఉద్గారాలను పోల్చి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సరాసరి ఏడు శాతం కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి.
ఈ ఏడు శాతం అంటే ప్రపంచవ్యాప్తంగా 240 టన్నుల భారీ కర్బన ఉద్గారాలు తగ్గాయని అర్థం. అన్ని దేశాలకన్నా బ్రిటన్‌లో 13 శాతం తగ్గగా, అమెరికాలో 12 శాతం, యూరోపియన్ కూటమి దేశాల్లో 11 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ప్రపంచం మొత్తం మీద ఏటా 34 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తుంటాయి.
గిగా టన్ను అంటే వంద కోట్ల టన్నులు. బ్రిటన్ దేశంలో ఏకంగా 13 శాతం కర్బన ఉద్గారాలు తగ్గడానికి ప్రధాన కారణం రవాణా రంగమే అని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ లాక్‌డౌన్‌లను రెండుసార్లు అమలు చేయడం వల్ల ప్రధాన రవాణా రంగం దాదాపుగా నిలిచిపోయింది.
యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, యూనివర్శిటీ ఆఫ్ ఎక్స్‌టర్ లండ్ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తెలిసాయి. 2019, డిసెంబర్ నెలలో రోడ్డు రవాణా రంగం నుంచి వెలువడిన కర్బన ఉద్గారాలతో 2020, డిసెంబర్‌లో వెలువడుతున్న కర్బన ఉద్గారాలను పోల్చి చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా పది శాతం తగ్గాయి. విమాన రంగం నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు కూడా దాదాపుగా 40 శాతం తగ్గుముఖం పట్టాయి.