తెలంగాణ: ఏడేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపైన కేసా..?
పోలీసులు సాధారణంగా ఫిర్యాదుదారులను తిప్పుకుంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జాప్యం చేస్తారన్న విమర్శలు తరచూ వినిపిస్తాయి.
కానీ ఈసారి మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో విభిన్నమయిన సంఘటన చోటుచేసుకుంది.
ఏకంగా ఏడేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగింది?
నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారు, లచ్చిరాం తండాలో 200 సర్వే నంబర్ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా, నర్సాపూర్ పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చనిపోయిన పాతులోత్ విఠల్ పేరును ఏ4 నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
విఠల్ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని తెలుసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే, విఠల్ ఏడేళ్ల క్రితమే మరణించాడు!
పోలీసుల పాత్రపై విమర్శలు
విచారణ లేకుండా చనిపోయిన వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చడం, విఠల్ కుటుంబ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది.
భూవివాదంలో తమ ప్రత్యర్థులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విఠల్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
విఠల్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని, ఫోటోలను చూపించి, ఈ తప్పిదంపై పోలీసులు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
నర్సాపూర్ పోలీసులపై ప్రజా విమర్శలు
చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, నర్సాపూర్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంఘటనతో పోలీసుల నిర్లక్ష్యపు వ్యవహారంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.