గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై గుంటూరు జిల్లాలో కేసు నమోదయింది. ఇటీవల గెలిచిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో కస్టోడియల్ టార్చర్ పెట్టారని సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద ఏపీ మాజీ సీఎం పై కేసు నమోదు అయింది.
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లాలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. తనను కస్టడీ సమయంలో చంపడానికి ప్రయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్ లో తెలిపారు.
కాగా ఈ కేసులో వైఎస్ జగన్ ను ఏ3గా పోలీసులు నమోదు చేశారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను ఈ ఫిర్యాదులో చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన 2021 మే 14న జరిగితే ఆయన నిన్న ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ పెట్టిన ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కస్టడీలో తీవ్రంగ హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు.
అలాగే తన మొబైల్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కూడా తనను ఇష్టం వచ్చినట్టు కొట్టారని తెలిపారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతి ప్వ్రును కూడా ఆయన తన ఫిర్యాదులో చేర్చారు. పోలీసుల ఒత్తిడితో డాక్టర్ తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. వైఎస్ జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని రఘురామ రాజు తెలిపారు.