తెలంగాణ: “ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు: కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నట్టి కుమార్ డిమాండ్”
సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ఆయన సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విభజన తర్వాత ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా ప్రజలు కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలక్షన్లలో ఆంధ్ర ప్రజల ఓట్లు బీఆర్ఎస్ విజయంలో కీలకం కావడం నిజమని, ఈ విషయాలను కౌశిక్ రెడ్డి విస్మరించడం దారుణమని అన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణకు ఆంధ్ర ప్రజలను చేర్చి మాట్లాడటం సరైంది కాదని, ఈ వివాదానికి ఆంధ్ర ప్రజలతో ఎలాంటి సంబంధం లేదని నట్టి కుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి ద్వేషపూరిత మాటలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశముందని, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు, లేకుంటే ఇది బీఆర్ఎస్ నాయకత్వ విధానం అనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో గతంలోనూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తీవ్రంగా ఉనికిలో ఉన్నాయని, డి. శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడి దీనికి ఉదాహరణ అని గుర్తుచేశారు.