కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తొలుత ఈ ఘటన సామూహిక అత్యాచారంగా భావించబడింది. కానీ, తాజా సీబీఐ నివేదిక ప్రకారం, ఒకే నిందితుడు సంజయ్ రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. సామూహిక అత్యాచారంగా వార్తలు వచ్చినప్పటికీ, ఇవి అవాస్తవాలని అధికారులు స్పష్టం చేశారు.
దర్యాప్తులో కీలక మార్పులు
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలు దారుణంగా హత్యకు గురైంది. మొదటిసారి స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, అనుమానాలు వెల్లువెత్తాయి.
కేసు సీబీఐకి అప్పగించగా, వారు దర్యాప్తును కొనసాగించారు. సీబీఐ వర్గాలు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘాతుకానికి కారణమని తేలింది. సామూహిక అత్యాచారం జరగలేదని, ఇదంతా వదంతులేనని సీబీఐ ప్రకటించింది.
సంజయ్ రాయ్ అరెస్టు
సంజయ్ రాయ్, ఆసుపత్రిలో వాలంటీర్‌గా పనిచేస్తూ, హత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ విచారణలో వెల్లడయింది. అతని మొబైల్ నుంచి అశ్లీల వీడియోలు, ఫోటోలు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు, అతడిని విచారించారు. అతడికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని తేల్చారు.
సామూహిక అత్యాచారం వార్తలు అవాస్తవం
హత్యాచారం జరిగినప్పటి నుండి, సామూహిక అత్యాచారంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో గ్యాంగ్ రేప్ జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ, సీబీఐ వీటిని ఖండించింది. నిందితుడు ఒక్కరే ఈ ఘాతుకానికి కారణమని, ఇతరులు ఇందులో పాల్గొనలేదని నివేదిక తేల్చింది.
మమతా బెనర్జీ విమర్శలు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐ దర్యాప్తుపై విమర్శలు చేశారు. దర్యాప్తు పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, న్యాయం ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు. అయితే సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
సాంకేతిక ఆధారాలు
సీసీటీవీ రికార్డింగ్, సాంకేతిక ఆధారాలు నిందితుడిని నిర్ధారించడంలో కీలకంగా నిలిచాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు సంజయ్ రాయ్ ఆసుపత్రి ప్రాంతంలో కనిపించగా, ఆగస్టు 9 తెల్లవారుజామున మళ్లీ అక్కడే ఉన్నట్లు రికార్డయింది. ఈ ఆధారాలతో పాటు అతడి మొబైల్‌లోని అసభ్యకర కంటెంట్ నేరం చేయడానికి అతడి పాత్రను బలపరిచాయి.
కేసులో అనుమానాలు
సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ తేల్చినప్పటికీ, వైద్యురాలు అంత దారుణంగా ఎలా మరణించిందన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రక్కనే ఉన్న పేషెంట్ల వార్డులో ఎవరూ అరుపులు, శబ్ధాలు వినిపించలేదా? ఆమె ప్రతిఘటనకు సంబంధించిన ఆధారాలు ఎందుకు కనుగొనబడలేదు? ఇలాంటి అనుమానాలపై విచారణ కొనసాగుతుండగా, ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు సమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. చివరిగా న్యాయస్థానం ఏం తేలుస్తుందో చూడాలి.