కోల్‌కతా: కోల్‌కతాలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్య, అత్యాచారం కేసులో సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో ఆమెపై సామూహిక అత్యాచారం జరగలేదని తేలింది.
ఆగస్టు 9న ప్రభుత్వాధీనంలోని ఆర్.జీ. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.
సీబీఐ ఆగస్టు 13న ఈ కేసును స్వీకరించడంతో, ఒక్క వ్యక్తి సంజయ్ రాయ్ మాత్రమే ఈ దారుణంలో ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
కోల్‌కతా పోలీస్‌కు అనుబంధంగా పనిచేసే సివిక్ వాలంటీర్‌గా ఉన్న రాయ్, ఆ వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి. DNA నివేదిక కూడా కేవలం ఒక వ్యక్తి ప్రమేయాన్ని ధృవీకరించింది.
ఆసుపత్రి సెమినార్ హాల్‌లో వైద్యురాలి మృతదేహం నగ్నంగా కనుగొనబడిన మరుసటి రోజే, ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. రాయ్ ఆ భవనంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపించింది.
రాయ్ మీద గృహహింస చరిత్ర ఆరోపణనలు ఉన్నాయి. ఫోరెన్సిక్ నివేదిక కూడా, గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన ఆరోపణల మధ్య, రాయ్‌నే బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు సూచిస్తోంది. సీసీటీవీ ఫుటేజీ కూడా రాయ్ ఆ భవనం లోకి ప్రవేశించినట్లు చూపిందని సీబీఐ పేర్కొంది, అక్కడే డాక్టర్ మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటన స్థలంలో రాయ్‌కు సంబంధించిన బ్లూటూత్ హెడ్‌సెట్ కూడా కనుగొనబడటంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకుముందు, ఒక డాక్టర్ బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వెజైనల్ స్వాబ్ టెస్టులో 151 గ్రాముల ద్రవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ సుబర్ణా గోస్వామి, బాధితురాలిపై ఉన్న గాయాల స్వభావం ఒకే వ్యక్తి చేసివుంటాడని అనుకోలేమని ఇండియా టుడేకి చెప్పారు.
బాధితురాలి తల్లిదండ్రులు కూడా కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చని ఆరోపించారు.
అయితే, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, 150 గ్రాములు అనేది జననాంగాల బరువును సూచిస్తుందని, ద్రవం కాదని పోస్టుమార్టం నివేదికను ఉటంకించారు.
అయితే, మరిన్ని వ్యక్తుల ప్రమేయం ఉందా అనే అంశంపై సీబీఐ ఇంకా విచారణ కొనసాగిస్తోంది. చివరి నివేదిక కోసం సీబీఐ ఫోరెన్సిక్ నివేదికను స్వతంత్ర నిపుణులకు పంపే అవకాశం ఉంది.