వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ పెద్దలు, సంపన్నులే లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్ళు వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు.
వారిలో ప్రముఖులు అయిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో పాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాకంగ్ కు గురయ్యాయి. ఆ ప్రముఖుల అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
హ్యాక్ అయిన అందరి ఖాతాలలోను ఒకటె పోస్టు దర్శనమిచ్చింది. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే, బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’ అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు కనిపించాయి.
ఆ ట్వీట్లు వారి అకౌంట్లలో దాదాపు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ టెక్నికల్ టీం పోస్టులన్నింటినీ తొలగించి ప్రస్తుతానికి ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది.
‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యంత భయంకరమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్‌లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు.
సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి సుమారు ఒక లక్షా 12 వేలకు పైగా డాలర్లు చేరాయని అంచనా వేస్తున్నారు. ఒకసారి ఇలా గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన డబ్బును తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.