వాషింగ్టన్: వికీపీడియా సోమవారం రోజున హ్యాక్ అయినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం జర్మన్ నాజీ పార్టీ జెండా చిత్రాలతో తాత్కాలికంగా నింపబడినట్లు సమాచారం. వీక్షకులు వికీపీడియా పేజీలు ఒపెన్ చేస్తే జర్మన్ నాజీ పార్టీ జెండాలు దర్శనమిచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలొ చాల వరకు ప్రముఖుల వికీపీడియా పేజీలే హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుసింది.
కాగా హ్యాకింగ్‌కు గురయిన పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు మరియు సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కనపడినట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియాలో తెలిపారు. అదేవిధంగా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు వినిపిస్తోంది.
అయితే ఈ వికీపీడియాను ఎలాంటి లాభం లేకుండా వికీమీడియా ఫౌండేషన్ చాలా ఏళ్ళుగా నిర్వహిస్తోంది. అయితే హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కానీ వికీపీడియా వెబ్‌సైట్లపై జరిగిన ఈ హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లోనే తిప్పికొట్టిన్నట్లు ప్రకటించారు.