న్యూ ఢిల్లీ: దేశ నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పథకం కోసం 2024 అక్టోబరు 12 నుంచి 25 వరకు ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకంలో భాగంగా, దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ద్వారా యువతకు తగిన అనుభవాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలు ఈ ఇంటర్న్‌షిప్‌లను అందించనున్నాయి. ప్రధానంగా 21-24 ఏళ్ల వయసులో ఉన్న కోటి మంది యువతీయువకులకు ఈ పథకం కింద నైపుణ్యాలు నేర్పేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ముఖ్య విశేషాలు:
- ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించనున్నారు.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇవ్వనున్నారు, ఇందులో రూ.4,500 కేంద్రం మరియు మిగతా రూ.500 ఆయా కంపెనీలు చెల్లిస్తాయి.
- అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌లో చేరగానే వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6,000 అందిస్తారు.
- పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన మరియు పీఎం సురక్షా బీమా యోజన కింద ఒక ఏడాది బీమా సౌకర్యం కూడా ఉంటుంది.
అర్హతలు:
- హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్య పూర్తి చేసినవారు, ఐటీఐ సర్టిఫికెట్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా చేసినవారు, అలాగే బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీలు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సీఏ, సీఎంఏ, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదివినవారు అనర్హులు.
- వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన వారు, ప్రభుత్వ ఉద్యోగ కుటుంబీకులు, ఆదాయపన్ను చెల్లించే వారు కూడా అనర్హులు.
దరఖాస్తు వివరాలు:
- అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- 2024 అక్టోబరు 26న తుదిజాబితా ప్రకటించబడుతుంది.
- 2024 అక్టోబరు 27 నుంచి నవంబరు 7 వరకు మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
మూడు కంపెనీల ఆఫర్లు:
ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి మూడు కంపెనీలు పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి మద్దతు ప్రకటించాయి. ఈ సంస్థలు 4 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 1,077 ఆఫర్లు అందించాయి, ఇందులో ఒకటి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.