న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో దేశ రైతులు చేపట్టిన సుదీర్ఘమైన ఉద్యమంలో తాజా పరిణామం కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, ఫిబ్రవరి 7న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైతులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.
ఢిల్లీ సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై ఢిల్లీ పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్‌లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
అక్కడకు చేరుకున్న నాయకుల్లో శిరోమణి అకాలీదల్‌కు చెందిన హరి సిమ్రత్ కౌర్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కు చెందిన సుప్రియ సులే, డీఎంకెకు చెందిన కనిమెళి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌతా రాయ్ తదితరులు ఉన్నారు. కాంక్రీట్ బారికేడ్స్, ముళ్ల కంచెల వెనుక రైతులున్న దృశ్యాలను చూసి షాకయ్యానంటూ హరిసిమ్రత్ పేర్కొన్నారు.
కాగా ప్రవేశపెట్టిన ఈ మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. అటు ఈ వ్యవహారంపై రైతులతో చర్చలు జరిపాలని, చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.