న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్‌కు మొదటి విడత టీకాను త్వరలో పంపుతామని కేంద్రం పలు రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. టీకాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది.
ఈ పంపిణీకి సంబందించిన అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖలో రిప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ప్రదీప్ హల్డేర్ ఈ నెల 5న రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆయన కోరారు. నమోదు చేయబడిన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ను జిల్లాలకు పంపిణీ చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన సూచనలను కూడా త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు.
దేశంలో యూపీ, హరియాణా మినహా నేడు చేపట్టే డ్రైరన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, స్వయంగా పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 736 జిల్లాల్లో ఈ బృహత్ కార్యక్రమం జరుగుతుందని ఆయన ప్రకటించారు.