న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న 7వ వేతన ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం తెలిపింది. కరువు భత్యం ఎప్పుడు చెల్లింపు చేస్తారు అనే అంశంపై కేంద్రం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. 7వ వేతన ఒప్పందం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం ఉన్న బేసిక్‌పై 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచబోతున్నారు.
కాగా ఈ పెరిగిన డీఏను ఈ ఏడాది సెప్టెంబరు నెల జీతంలో కలిపి ఇస్తారు అనే వార్తలు వస్తున్నాయి. మార్చిన డీఏతోనే కాకుండా గతంలో మూడు దఫాలుగా ఇవ్వకుండా వాయిదా పడ్డ డీఏ బకాయిలు మరియు పెన్షనర్లరకు సంబంధించి డీఆర్ బకాయిలు కూడా సెప్టెంబరులోనే చెల్లించనున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక నిపుణుల అంచనా మేరకు కరువు భత్యానికి సంబంధించి క్లాస్ వన్ ఆఫీసర్లకి డీఏ రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు పెరగొచ్చని అంచనా. అలాగే లెవల్ 13కి సంబంధించి రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900ల వరకు పెంపు ఉండొచ్చని అంచనా, లెవల్ 14 విషయంలో రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు ఉండవచ్చు.
కోవిడ్ సందర్భంగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకోవైపు 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంపు తదితర అంశాలపై అనేక సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో జులై1 నుంచి 7వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన జీతంతో కలిసి డీఏలు చెల్లిస్తారని అందరూ భావించారు. అయితే కేంద్రం డీఏ , జీతాల చెల్లింపును మరోసారి వాయిదా వేసింది.