జాతీయం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు రూ. 3,300 కోట్ల సహాయం ప్రకటించింది. ఈ నిధులు తక్షణ సహాయ చర్యల కోసం విడుదల చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రధానంగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఈ సాయం అందుబాటులోకి రానుంది.
తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వాహనాలు, పశుసంపదకు నష్టం వాటిల్లింది. రైతులు పంటలను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో విపరీతంగా నష్టం జరిగింది. ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు ముప్పు మోపాయి. ప్రాణనష్టం కూడా తలెత్తింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి సాయం కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రాష్ట్రాల్లో పర్యటించి నష్టాలను అంచనా వేశారు. ఆయన పేర్కొన్న దాని ప్రకారం, రైతులకు పంటలు కోల్పోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కేంద్రం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఫోన్ చేసి, అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు రూ. 3,300 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.