అమరావతి: ఏపీలో వరదలతో 32 మంది మృతి, ఏపీకి రానున్న కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మృతుల సంఖ్య 32కి చేరింది. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య 45,369కి పెరిగింది. ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏడు మంది, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు, బీమా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై పాడైన వాహనాలు, ఇతరత్రా బీమా క్లెయిమ్‌లను 10 రోజుల్లో పరిష్కరించాలని, పక్షం రోజుల్లో వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను సందర్శించి, బాధితులతో మాట్లాడనున్నారు.
కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డియం అండ్ పియం) సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనుంది.
ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఏ) సలహాదారు కల్నల్ కెపి సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యుసీ) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసిసి) యం రమేశ్ కుమార్, ఎన్‌డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్న ఉన్నారు.
ఈ బృందం నేరుగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చి, ప్రభుత్వం చేసే సహాయక చర్యలపై సమీక్ష జరుపనుంది.
మరోవైపు, వాతావరణ శాఖ మరో అల్పపీడనం సెప్టెంబర్ 5న ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.