విజయవాడ: ఏపీలో పీఆర్సీ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలోని పలు ఉద్యోగ సంఘాలు జత కలిసి మొదలుపెట్టిన సమ్మె కార్యాచరణలో భాగంగా ఇవాళ చలో విజయవాడ కార్యక్రమం ఇవాళ పోలీసులు నిర్భంధం చేసినప్పటికీ భారీగా విజయవంతమైనట్లు కనిపిస్తుంది.
విజయవాడ కు వచ్చే అన్ని రహదారుల్లో పోలీసులు గట్టి నిఘా వేశి ఎక్కడికడ్డ బస్సులు ప్రైవేట్ వాహనాలను ఆపి తనిఖీ చేసి అనుమానం వచ్చిన అందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయినప్పటికీ లక్షల్లో టిచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ చేరుకుని బీటిఆర్యెస్ రోడ్డులో ఇసుక వేసిన రాలనంతగా కిక్కిరిసి తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు.
పోలీసుల పహారాను దాటడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు రకరాకాల దారులు వెతుకుతూ మారు వేషలు వేసుకున్నారు. ఒకరు రైతులాగా, మరొకరు యాచకులుగా, కూలీ వారిగా ఇలా రకరకాల వేషాల్లో విజయవాడకు చేరుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తమ ఆవేదన అర్థం చేసుకుని తమకు న్యాయం చేసి పీఆర్సీ ని సవరించాలని కోరారు. తదుపరి 5వ తేదీ నుండి సహాయ నిరాకరణ జరుగుతుందని, ప్రభుత్వ యాప్ లను వినియోగించమని, 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగనున్నట్లు తెలిపారు.