స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సోమవారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ సెమీఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో (77), మహ్మద్ అలీ (45), హోస్సేన్ (26) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ 4, విల్ ఓ’రూర్కే, హేన్రి, జెమిసన్, తలో వికెట్ తీసారు.
237 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి గెలిచింది. రచిన్ రవీంద్ర అద్భుత శతకం (112; 105 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టామ్ లాథమ్ (55) మరియు డెవాన్ కాన్వే (30) పరుగులు చేశారు.
ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీస్‌లోకి ప్రవేశించగా, గ్రూప్-ఏ నుంచి టీమిండియా కూడా సురక్షితంగా నిలిచింది. పాకిస్థాన్ రెండు పరాజయాల వల్ల టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక, మార్చి 2న న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఆసక్తిగా మారింది.