fbpx
Thursday, November 28, 2024
HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వానికి ఒకటో తారీఖు గండం… గట్టెకేనా?

ఏపీ ప్రభుత్వానికి ఒకటో తారీఖు గండం… గట్టెకేనా?

Chandrababu-AP-CM

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ఒకటో తారీఖు అంటేనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మూడు ప్రధాన పద్దులను ఒకే రోజు చెల్లించాల్సి రావ‌డం, నిధుల ప‌రిస్థితి ఆశించిన విధంగా లేక‌పోవ‌డంతో గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం, ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం కూడా ప్ర‌తి నెలా 1వ తేదీ అంటేనే ఒక పెద్ద ‘గండం’గా భావిస్తున్నాయి.

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు, ఉద్యోగుల‌కు వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పింఛ‌న్లు ఈ మూడు ప‌ద్దుల‌ను 1వ తేదీనే ఇవ్వాల్సి ఉండ‌డం స‌ర్కారుకు త‌ల‌కుమించిన భారంగా మారింది. గతంలో జ‌గ‌న్ హ‌యాంలో ముందుగా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు సొమ్ములు ఇవ్వడాన్ని మొదట ప్రాధాన్యతగా పెట్టేవారు.

తరువాత ఉద్యోగుల‌కు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు సొమ్ములు ఇచ్చేవారు. ఈ విధానంతో ఈ చెల్లింపులు చాలా రోజులు ఆల‌స్యం కావ‌డంతో వివాదాల‌కు దారితీసింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆందోళ‌న‌కు దిగిన సందర్భాలున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి:

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రూ.3000 చొప్పున ఇవ్వ‌డం జరిగింది. కానీ ఈ చెల్లింపులు సమయానికి లేకపోవడం వల్ల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనలకు దిగిన సందర్భాలున్నాయి. ఇది ఎన్నికల సమయంలో ప్రజల వ్యతిరేకతకు దారితీసి వైసీపీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితిని తీసుకువ‌చ్చింది.

కూటమి ప్రభుత్వానికి సవాళ్లు:

కూటమి సర్కారుకు కూడా ఈ గండం తప్ప‌డం లేదు. పైగా గత వైసీపీ స‌ర్కారు రూ.3000 చొప్పున సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను ఇస్తే, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు రూ.4000 చొప్పున ఇవ్వాల్సి వస్తోంది. తొలి నెలలోనే ఈ గండం నుంచి బయట పడేందుకు రూ.7-9 వేల కోట్లు అప్పు చేయడం జరిగింది.

ప్రస్తుత పరిస్థితి:

మరో మూడు, నాలుగు రోజుల్లో 1వ తేదీ రానుంది. ప్రస్తుతం సుమారు రూ. 4 వేల కోట్లకు పైబ‌డి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు చెల్లించాల్సి ఉంది. సాధారణ పింఛ‌న్ల‌ను రూ. 4 వేల చొప్పున, దివ్యాంగ పింఛ‌ను రూ. 6 వేల చొప్పున, ఇత‌ర వ్యాధిగ్ర‌స్థుల‌కు రూ. 10 వేలు, రూ. 15 వేల‌చొప్పున చెల్లించాల్సి ఉంది. దీంతో నిధుల అవ‌స‌రం పెరిగింది.

అదేస‌మ‌యంలో ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన పింఛ‌న్లు కూడా స‌ర్కారు 1వ తేదీనే ఇస్తుందా లేక వాయిదా వేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఖ‌జానాలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు స‌రిప‌డే నిధులు మాత్రమే ఉన్నాయి. ఉద్యోగుల‌కు జీత భ‌త్యాల వ్య‌వ‌హారం పెండింగులోనే ఉంది.

కానీ వ‌చ్చే మంగ‌ళ‌వారం (30 జూలై) నాడు ఆర్బీఐ నిర్వ‌హించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల వేలం ద్వారా రూ. 4 వేల కోట్లు స‌మీక‌రించేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నిధులు వ‌స్తే ప్ర‌భుత్వానికి 1వ తేదీ గండం తీరుతుంద‌ని అధికారులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular