ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు తన కేబినెట్ మంత్రుల పనితీరును మెరుగుపరచడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి ప్రత్యేక యాప్ ద్వారా మంత్రులు తమ అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ యాప్‌లో రోజుకు రెండు సార్లు అటెండెన్స్ వేయడం తప్పనిసరి చేయనున్నారు. మంత్రులు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా యాప్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది.
ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 5 గంటల లోపు అటెండెన్స్ నమోదు చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు డ్యాష్‌బోర్డుకు ఈ వివరాలు చేరుతాయి. దీంతో మంత్రుల పనితీరును సులభంగా అంచనా వేయవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
2015-19 మధ్య ఈ విధానాన్ని పరీక్షించినా, తగిన ఫలితాలు రాలేదు. అయితే ఈసారి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
సెలవుల రోజుల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ విధానం అమలు చేస్తోన్న రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ విధానానికి మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.