ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఇటీవల చిన్నారులపై హత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలు ప్రజల హృదయాలను కలచివేస్తున్నాయి. పోలీసులు, చట్టాలు ఎంత కఠినంగా వ్యవహరించినా, కామాంధుల పెచ్చుమీరుడు ఆగడం లేదు.
తాజాగా తిరుపతి జిల్లా వడమాల మండలం ఎఎంపురం గ్రామంలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులను నడిరోడ్డుపై ఉరి తీయాలని చంద్రబాబు అన్నారు. అటువంటి కఠిన శిక్షలతోనే కామాంధులు భయపడతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గంజాయి, మద్యం వంటి కట్టడిలేని మత్తు పదార్థాల వాడకమే ఇలాంటి ఘటనలకు కారణమని, మహిళలు ఆటవస్తువులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడపిల్లలపై వేధింపులు జరిపే ప్రతి ఒక్కరిని కఠిన చర్యలు ఎదుర్కొనేలా చేయాలని పిలుపునిచ్చారు.
ఈ దారుణ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వేగంగా విచారణ చేపట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఈ ఉదంతంతో రాష్ట్రంలో చిన్నారుల రక్షణపై ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కఠిన చట్టాలు, తక్షణ చర్యలే పరిష్కారం కావాలి.