ఏపీ: జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఏ స్థాయిలో జమిలి ఎన్నికల చర్చ సాగుతున్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు అంటూ ఎలాంటి అవకాశమూ ఉండదని అన్నారు.
విజన్ డాక్యుమెంట్ 2047 అమలుపై నిరంతర సమీక్ష ఉంటుందని, ఆ లక్ష్యానికి చేరుకోవడంలో ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త విధానాలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఏపీని ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
అదానీతో జగన్ ప్రభుత్వం చేసిన సౌర విద్యుత్ ఒప్పందాలపై వచ్చిన ఆరోపణలను చంద్రబాబు ప్రస్తావించారు. అమెరికాలో నమోదైన కేసులో రూ.1750 కోట్ల లంచం ఆరోపణలు ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని వివరించారు.
ఈ ఒప్పందాలను సమగ్రంగా పరిశీలించి, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు ప్రతిపాదించిన కొత్త విధానాలు రాష్ట్ర రూపురేఖల్ని మార్చడమే కాకుండా, ప్రజలకు ఆర్థిక స్వయం సమృద్ధిని అందించడంలో కీలకంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు కార్యాచరణపై అందరి చూపు నిలిచింది.