తిరుపతి లడ్డూ కల్తీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఈ ఘటనపై సమగ్ర విచారణ కోరుతూ సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసింది. ఈ నేపథ్యంలో, అలాంటి ఘటనలు మళ్లీ ఎక్కడా పునరావృతం కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకులకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఏ దేవాదాయ కమిషనర్ లేదా జిల్లా అధికారులు ఆలయ వైదిక విధుల్లో జోక్యం చేసుకునే అవకాశమే ఉండదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేశాయి.
ఆలయాల్లో జరిగే యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు వంటి అన్ని వైదిక కార్యక్రమాల్లో అర్చకులదే పూర్తి అధికారం. అధికారులు ఈ కార్యక్రమాల్లో పరిమిత పాత్రనే నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే, వైదిక విధానాల నిర్వహణలో ఏకాభిప్రాయం లేకపోతే పీఠాధిపతుల సలహాలను తీసుకునే వెసులుబాటు ఉంది. అర్చకులు ఆలయ ఆగమశాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించే స్వేచ్ఛ పొందారు.
ఈ నిర్ణయంతో అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వారు తమ ధార్మిక విధులను స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఇది సహకారమని అభిప్రాయపడ్డారు.