మున్సిపల్ చట్ట సవరణ ద్వారా వైసీపీకి మరో పెద్ద ఝలక్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ స్కెచ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ చట్ట సవరణపై నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం చైర్మన్లు, మేయర్లపై నాలుగేళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండగా, దీనిని రెండున్నరేళ్లకు తగ్గించే మార్పులు చేయాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2021లో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై భారీ ఆధిపత్యం చాటుకుంది. 75 మున్సిపాలిటీలలో 74 చైర్మన్ పదవులు, 12 కార్పొరేషన్లలో మేయర్ పదవులు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో, నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌కి ఈ పరిస్థితి సమస్యగా మారింది.
వైసీపీ ఆధిపత్యంలో ఉన్న మున్సిపల్ పాలకవర్గాలపై నియంత్రణ సాధించేందుకు, నాలుగేళ్ల గడువును రెండున్నరేళ్లకు తగ్గించేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త చట్ట సవరణను తెచ్చే ఆలోచనలో ఉంది. ఈ ప్రతిపాదన అమరావతిలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టి ఆమోదం పొందడానికి పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం తెస్తున్న ఈ చట్ట సవరణ అమలులోకి వస్తే, మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెరగవచ్చని వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేక చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరడంతో ఈ పరిణామం మరింత క్లిష్టంగా మారనుందని విశ్లేషకుల అంచనా.
అయితే, ఈ చట్ట సవరణ కోర్టు ముందుకు వెళ్లనుందా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. పాత చట్టం ప్రకారం ఎన్నికైన చైర్మన్లు, మేయర్లపై నూతన చట్టాన్ని అమలు చేస్తే అది చెల్లదని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఈ సవరణపై కోర్టుకు వెళ్ళే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.