2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడటంతో, చంద్రబాబు కీలక నాయకుడిగా నిలిచారు. ఈ సారి బీజేపీ ఆశించినంత సీట్లు రాకపోవడంతో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో, చంద్రబాబుకు కేంద్రంలో ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఆయన 21 ఎంపీ సీట్లు కలిగి ఉండటంతో పాటు, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావడంతో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి బీజేపీ పెద్దలు చంద్రబాబు అనుభవాన్ని గౌరవిస్తున్నారు. చంద్రబాబును “కింగ్ మేకర్” అని జాతీయ మీడియా కూడా పిలిచింది.
ఇటీవల హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, అమిత్ షా తన పక్కన చంద్రబాబును కూర్చోబెట్టడం, ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమ నేతకు కేంద్రంలో ఇంత గౌరవం దక్కిందని టీడీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ 23 సీట్లు సాధించినా ఇంత గౌరవం లభించలేదని, ఆయనపై ఉన్న కేసులే దానికి కారణమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.