ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ – కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!
జల్ శక్తి మంత్రితో పోలవరం చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటన బిజీగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో వీరు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యం కలిగిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై చర్చించారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.12,000 కోట్లు కేటాయించినప్పటికీ, వాటి విడుదలపై మరింత స్పష్టత కోరారు.
అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ఈ చర్చలు సానుకూలంగా కొనసాగినట్లు సమాచారం.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో హాజరు
కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానానికి వెళ్లనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే భాగస్వామి పార్టీల ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పొందారు.
అమిత్ షాతో కీలక చర్చలు
మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రత్యేకంగా పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్, రాష్ట్రానికి కేంద్ర సహాయం, కొత్త పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.
వ్యవసాయ మంత్రితో రైతుల సంక్షేమంపై చర్చ
సాయంత్రం 4:45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితిపై చర్చించి, గిట్టుబాటు ధరల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు లేఖలు రాశారు.
ఢిల్లీ పర్యటన ముగించి హైదరాబాద్‌కు..
ఈ సమావేశాల అనంతరం సాయంత్రం 5:55 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.