ఏపీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం, సుభాష్‌ను ప్రత్యేకంగా 20 నిమిషాలపాటు కలుసుకుని ఆయన పనితీరుపై విమర్శలు చేసినట్టు తెలిసింది.
రేషన్ బియ్యం అక్రమ రవాణా, రొయ్యల ఫ్యాక్టరీల వ్యర్థాలు, ఫార్మా ప్రమాదాలపై మంత్రి వ్యవహరించిన తీరు చంద్రబాబుకు నచ్చలేదని సమాచారం.
రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించి సుభాష్ అనుచరుల మిల్లులపై వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
స్థానికంగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమాలు వెలుగుచూసినా, మంత్రి సుభాష్ దానిని పట్టించుకోకుండా మౌనం వహించారన్నది సీఎం ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అలాగే, రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు బయటకు వస్తున్నాయని వచ్చిన ఫిర్యాదులపై మంత్రి స్పందించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలానికి వెళ్లినప్పటికీ, విచారణ చేయకుండా ఆ సమస్యను చూసీ చూడనట్లు ఉండటం కూడా విమర్శలకు దారితీసింది.
చంద్రబాబు సుభాష్‌ను ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.