ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ రూ. 931 కోట్లుగా ఉంది.
ఇందులో చంద్రబాబు పేరిట రూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన భార్య భువనేశ్వరి పేరిట రూ. 895 కోట్ల ఆస్తులున్నాయి. అయితే చంద్రబాబు పేరుపై రూ. 10 కోట్ల రుణభారం కూడా ఉంది.
ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ. 180 కోట్ల అప్పు కూడా ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ. 51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తితో జాబితాలో చివరి స్థానంలో నిలిచారు.
దేశవ్యాప్తంగా 31 మంది ముఖ్యమంత్రుల సగటు ఆస్తి విలువ రూ. 52.59 కోట్లుగా ఉండగా, వారిలో అధిక సంపద కలిగిన వారు చంద్రబాబు కావడం విశేషం. ఈ నివేదిక మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.