ఏపీ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన సొంత గ్రామం నారా వారి పల్లెలో మూడు రోజులు గడపనున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకోనున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నారా వారి పల్లెలో ఆదివారం రాత్రి సీఎం చేరుకున్నారు. కుటుంబసభ్యులు, నందమూరి కుటుంబం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం పల్లె చేరుకొని పండుగలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానాలు, హరిదాసు కీర్తనలు, ఎద్దుల పందేలతో పల్లె శోభ సాగరాన్ని తలపించేలా సిద్ధమైంది. ముచ్చటైన మూడురోజులపాటు నారా వారి పల్లె పాలనకు కేంద్రంగా మారనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతా పనులు అక్కడ నుంచే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సీఎం చంద్రబాబు ఈ సంక్రాంతి ఉత్సవాలను మరింత వైభవంగా జరుపుకోవాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలు సంక్రాంతి వేడుకల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.