ఆంద్రప్రదేశ్: డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో సేవలను వేగంగా ప్రారంభించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన దిశా నిర్దేశం ఇచ్చారు.
విశాఖపట్నంలో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, అలాగే గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం డబుల్ డెక్కర్ మోడల్‌లో చేపట్టనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల మేర ఇదే తరహాలో మెట్రో నిర్మాణం చేయనున్నారు.
ముఖ్యమంత్రితో గురువారం నాడు జరిగిన సమీక్ష సమావేశంలో 2017 మెట్రో పాలసీ ఆధారంగా నిధుల సమీకరణపై చర్చ జరిగింది. కేంద్రం తక్షణ సాయం అందించి ఈ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు. కోల్‌కత్తాలో 16 కిలోమీటర్ల మేర కేంద్రం వందశాతం నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ఉదాహరణగా చూపించి, అదే విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ మెట్రో నిర్మాణానికి కృషి చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రానికి 66 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో ప్రాజెక్టు, 76.90 కిలోమీటర్ల మేర విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే డీపీఆర్‌ల ఆమోదం పొందింది. నిధుల సమీకరణకు కేంద్రంతో సంప్రదింపులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యల్ని సైతం తగ్గిస్తాయని తెలిపారు.
డబుల్ డెక్కర్ మోడల్‌లో కింద రహదారి, దాని పై ఫ్లైవోవర్, ఆపై మెట్రో నిర్మాణం చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ తరహా మోడల్ ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతమైందని, ఆ అనుభవాలను రాష్ట్రంలోనూ వినియోగించాలని సీఎం సూచించారు.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాలుగు సంవత్సరాల గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. నిధుల కొరత లేకుండా కేంద్రంతో చర్చించి మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్థన్ రెడ్డి, మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులకు కఠిన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకే ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు.