తిరుపతి: నగరంలో సోమవారం ప్రారంభమైన మహా కుంభ ఆప్ టెంపుల్స్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు.
అంతేకాకుండా, తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర దేశాల్లోనూ ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సదస్సుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీలోని ఆలయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తుందని తెలిపారు.
ఆలయాల విశిష్టతను భావితరాలకు అందించేందుకు ట్రస్ట్ బోర్డులను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. దైవ భక్తిని పెంపొందించడంతో పాటు టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థల కేటాయింపు కోరుతూ టీటీడీ తరఫున మహారాష్ట్ర సీఎంకు చంద్రబాబు వినతిపత్రం సమర్పించారు.