ఏపీ: ఏలూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆడవారిపై తప్పుగా మాట్లాడితే సహించేది లేదు, అది వారికే చివరి రోజు అవుతుందని గట్టిగా హెచ్చరించారు. తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిగా ఉంటానని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో తనపై గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేస్తూ.. ఇప్పుడు గౌరవ సభగా మార్చిన తర్వాతే సీఎంగా అడుగుపెట్టానని చెప్పారు.
వైఎస్సార్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్తపై తక్షణమే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఇక బీసీ సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉందని వివరించారు.
త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు. బీసీలకు ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశానిదేనన్నారు. అమరావతిలో బీసీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటవుతుందని వెల్లడించారు.
రైతులకు మే నుంచి విడతల వారీగా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. చింతలపూడి ప్రాజెక్టు కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించనున్నట్టు తెలిపారు.
సంపద ఓ వ్యక్తికి కాకుండా, పేదలకు కూడా చేరాలి అన్నదే తమ లక్ష్యమని చెబుతూ.. ఆగిరిపల్లిలో 206 పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.