అమరావతి: చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ అని పేరు పెట్టారు. పథకం అమలులో భాగంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, విద్యావాలంటీర్లను నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే, ముస్లిం మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఈ పథకానికి ఆమోదం తెలపగా, నౌకల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.
555 విద్యావాలంటీర్ల నియామకానికి ప్రణాళిక
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 185 మదర్సాలు ఉన్నాయి. ప్రతి మదర్సాలో ముగ్గురు చొప్పున మొత్తం 555 మంది ఉర్దూ విద్యావాలంటీర్లను నియమించడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఈ పథకానికి ఏడాదికి రూ. 13 కోట్ల వ్యయం అంచనా వేసిన అధికారులు, దీనికి ఆర్థికశాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.
1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలల కోసం కేంద్రం నిధులు
రాష్ట్రంలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నట్లు గుర్తించగా, వీటిలో 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలో కనీసం 15మందికి మించి విద్యార్థులు ఉన్నారని కేంద్రానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వం ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు రూ.30,000 గౌరవ వేతనం చెల్లించనుంది. విద్యావాలంటీర్ల నియామకం త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
మైనార్టీ విద్యకు మద్దతుగా చంద్రన్న పథకం
2014-19 మధ్య టీడీపీ హయాంలో మదర్సాల విద్యార్థులకు ఆధునిక విద్య అందించేందుకు విద్యావాలంటీర్ల నియామకాన్ని చేపట్టారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగించలేదు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ముస్లిం మైనారిటీలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
లంబసింగి మ్యూజియం నిర్మాణానికి నిధుల విడుదల
ఇంకొకవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబసింగి సమీపంలోని తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.35 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మ్యూజియం కోసం కేంద్రం రూ.15 కోట్లు, రాష్ట్రం రూ.20 కోట్లు వ్యయం చేయనుంది.