fbpx
Thursday, January 16, 2025
HomeAndhra Pradeshహైవే పై ప్రతి 25 కిలోమీటర్లకు ఎలెక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు

హైవే పై ప్రతి 25 కిలోమీటర్లకు ఎలెక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు

CHARGING-STATIONS-EVERY-25KM-IN-ANDHRA-PRADESH

అమరావతి: ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈ– వెహికల్స్‌) వినియోగాన్ని ప్రోత్సాహించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో దీనికి అత్యవసరమైన ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉందని అన్నారు.

విద్యుత్ తో నడిచే వాహనాల వినియోగం (ఈ–మొబిలిటీ), వాటికి కావాల్సిన చార్జింగ్‌ స్టేషన్ల విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గో–ఎలక్ట్రిక్‌’ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి గురువారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద తొలి దశలో 400 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీజిల్, పెట్రోల్‌ వాహనాల వల్ల వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్‌ వాహనాలు బాగా ఉపకరిస్తాయని తెలిపారు. అలాగే ఎలెక్ట్రిక్ వాహనాల‌ నిర్వహణ వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుందని, ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి మాట్లాడుతూ దేశంలో 2023 నాటికి కరెంటుతో నడిచే మూడు చక్రాల వాహనాలు, 2025 నాటికి కరెంటుతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. నెడ్‌క్యాప్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 400 చార్జర్ల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ, ఆర్‌ఐ ఈఎల్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular