న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో టేబుల్ లో చివరలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం తమ జోరు కొనసాగిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
సెకండ్ బ్యాటింగ్ చేసిన చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డు ప్లెసిస్ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును నడిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 78 బంతుల్లోనే 129 పరుగులు జోడించారు.
సన్‌రైజర్స్ ఆరంభంలోనే బెయిర్‌స్టో (7) వికెట్ కోల్పోయింది. సున్నా వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను ధోని వదిలేసినా, బెయిర్‌స్టో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం మూడో స్థానంలో వచ్చిన పాండే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గత రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని పాండే పునరాగమనంలో పట్టుదల కనబరుస్తూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.
అలీ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్‌కు కొత్త బంతిని తెప్పించాల్సి వచ్చింది. అయితే 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పాండే తర్వాతి 10 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టాపార్డర్ విఫలమైతే రైజర్స్ కుప్పకూలిపోతోందన్న ముందు జాగ్రత్త కూడా అందుకు కారణం కావచ్చు. తన 11వ బంతికి తొలి ఫోర్ కొట్టిన వార్నర్ మరో 14 బంతులకుగానీ మరో ఫోర్ కొట్టలేకపోయాడు. అర్ధ సెంచరీ చేరుకునే వరకు ఒక్కసారి కూడా అతని స్ట్రయిక్‌రేట్ 100 దాటకపోవడం విశేషం.
చెన్నై బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టడి చేయడంతోపాటు వార్నర్, పాండేలను ఇన్‌గిడి ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే విలియమ్సన్ ఒక్కసారిగా సీన్ మార్చేశాడు. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో అతను వరుస బంతుల్లో 4, 6, 4, 4 బాదగా…. స్యామ్ కరన్ వేసిన 20వ ఓవర్ చివరి రెండు బంతుల్లో కేదార్ జాదవ్ (12 నాటౌట్) వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫలితంగా స్కోరు 171 పరుగులకు చేరింది.