దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి మొదటగా నిష్క్రమించిన జట్టు చెన్నై. అయితే నిష్క్రమించిన తరువాత చెన్నై ఇప్పుడు వరుసగా మ్యాచ్ లు గెలుస్తోంది. క్రితం మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్, తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద షాకిచ్చింది.
గురువారం కెకెఆర్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎన్నుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు.
లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కు తోడుగా జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు.