హైదరాబాద్ : తెలంగాణ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం నుండి సాగుతున్న ఈ వివాదంపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణను చేపట్టింది. రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అఫిడవిట్ దాఖలు చేశింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు సంప్రదించకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కోర్టులో తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆయన గడువు కావాలని కోర్టును కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో ఒక వారంలోపు విచారణ పూర్తిచేయాలని కోరుతోంది.
కాగా కోర్టు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ, ఇరుపక్షాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. జర్మనీ పౌరసత్వం కలిగి పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు విన్నవించారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి సారిగా స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు.