మైసూరు: అంతరిక్షంలో నివసించే వ్యోమగాములు, అక్కడ వారి జీవన శైలి ఎలా ఉంటుందో వారు అక్కడ ఏమి తింటారో అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురౌతూనే ఊంటాయి. కాగా వ్యోమగాముల కోసం శాస్త్రవేత్తలు ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.
వారి కోసం తయారు చేసే ఆహార పదార్దాలు చాలా రోజులు నిలువ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంది. వారికి కావాల్సిన వంటకాలను మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎఫ్ఆర్ఎల్) మీల్స్ రెడీ టు ఈట్ ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేసింది.
ఆ వంటల జాబితాలో ఆవకాయ పచ్చడి, చికెన్ బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా, దాల్ మక్ని, షాహి పన్నీర్, చికెన్ కోర్మా వంటి 40 రకాల ప్రత్యేక వంటలను సిద్ధం చేసినట్లు ఒక అధికారి తెలిపారు. సదరు అధికారి మాట్లాడుతూ, వ్యోమగాముల రుచి లేదా ఆహార ప్రాధాన్యతలు గురుంచి మాకు తెలియదు. ఎందుకంటే వారి ఇష్టానికి అనుగుణంగా కాకుండా ఇస్రో తెలిపిన మేరకు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
గగన్‌యాన్ కోసం ఎంపికైన ఆరుగురు ఇచ్చిన జాబితాలో నుంచి ఆహార పదార్థాలను ఎంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. తరువాత వారి అభిప్రాయం ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయబడుతుంది అని అతను పేర్కొన్నారు. డిఎఫ్‌ఆర్‌ఎల్ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సిద్ద చేసి ప్యాక్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది.
వారు తయారు చేసిన ఈ వంటకాలు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రోజూ సుమారు 2,500 కిలోల కేలరీలు శరీరానికి అందేలా మొత్తం డైట్ ప్లాన్ చేశారు. అలాగే ఆహారాన్ని వేడి చేయడం కోసం అంతరిక్షంలో ఉపయోగించగల ప్రత్యేక హీటర్ని కూడా సిద్ధం చేసారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసారు.