న్యూయార్క్: ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల హక్కులను చైనా దేశం కాలరాస్తోందని మండిపడ్డాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఆయా దేశాల ప్రతినిధులు చైనా తీరును తప్పుపట్టాయి.
ఈ నేపథ్యంలో యూఎన్‌లో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ మాట్లాడుతూ, జింగ్జియాంగ్లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించడం పట్ల ఆందోళనగా ఉంది. తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
యూకే ప్రతినిధి జేమ్స్ రాస్కో కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగర్లు, ఇతర భిన్న మైనార్టీ జాతుల పట్ల అణచివేత వైఖరిని ప్రదర్శిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం ఎట్టీ పరిస్థితిలోనూ సరికాదని చైనాకు హితవు పలికారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే పేరిట మైనార్టీలను నిర్బంధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జర్మనీ రాయబారి విమర్శించారు.
ఐతే హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా తీసుకువచ్చిన విధానాలపై కూడా పలు దేశాలు ఇప్పటికే యూఎన్ఎస్సీ రహస్య సమావేశంలో చర్చను లేవనెత్తాయి. అయితే డ్రాగన్ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పింది.