అంతర్జాతీయం: వాణిజ్య యుద్ధంలో అమెరికాను చావుదెబ్బ కొట్టిన చైనా!
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలుపుదల
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. తాజాగా చైనా (China) ప్రభుత్వం తమ దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు (Rare Earth Minerals), కీలక లోహాలు (Critical Metals), అయస్కాంతాల (Magnets) ఎగుమతులను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో వాషింగ్టన్ (Washington) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రంప్ సుంకాలకు బీజింగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను 145 శాతానికి పెంచారు. దీనికి ప్రతిగా చైనా ప్రభుత్వం కూడా అమెరికా వస్తువులపై సుంకాలను 125 శాతానికి పెంచింది. ఈ క్రమంలో అరుదైన ఖనిజాలపై ఎగుమతులను నిలిపివేయడం కీలక నిర్ణయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90శాతం చైనా నుంచే వెళుతున్నాయి.
పశ్చిమ పరిశ్రమలకు నష్టమేనా?
ఈ అరుదైన ఖనిజాలు అధికంగా టెక్నాలజీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమల్లో వినియోగించబడతాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని Lockheed Martin, Tesla, Apple వంటి ప్రముఖ సంస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది. ప్రస్తుతం అమెరికా వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ కొంత వరకు నిల్వ ఉన్నా, వాటితో దేశరక్షణ ఒప్పందాల అవసరాలు తీరడం సాధ్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
చర్చలకు ముందుకు రానున్న అమెరికా
చైనా నిర్ణయం తాత్కాలిక ముప్పుగా మారుతోందని అమెరికా టెక్నికల్ సలహాదారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ టారిఫ్‌ల అంశంలో చైనాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముందని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Besant) వ్యాఖ్యానించారు. మళ్లీ చర్చల మాట ఊహించినప్పటికీ, బీజింగ్ అరుదైన ఖనిజాల ఎక్స్‌పోర్ట్ లైసెన్స్‌లను కూడా పరిమితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.