బిజీంగ్: ప్రపంచంలోనే టెక్నాలజీలో ఎప్పుడూ తనకు తానే సాటి అనిపించకుంటూ చైనా వేగంగా దూసుకుపోతోంది. ఎప్పుడూ భిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు సవాలు విసిరే చైనా మరో అద్భుతానికి తెరతీసింది. ఇటీవల కృత్రిమ సూర్యూడిని తయారు చేసుకుని చైనా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
తాజా చైనా మరో ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి గాల్లో తేలే రైలును ఆవిష్కరించింది. ఈ అధునాతన రైలు, పట్టాలపై తేలుతూ గంటకు 620 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రైలు కింద అస్సలు చక్రాలే ఉండవు. మాగ్నెటిక్ లెవిటేషన్, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ (హెచ్‌టీఎస్)లో పురోగతి సాధించడం ద్వారా దీనికి రూపకల్పన చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు వివరించారు.
ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటికంటే వేగంగా ఈ రైలు దూసుకుపోతుందని వారు పేర్కొన్నారు. కాగా మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో డిజైన్ చేసిన ఈ రైలు చక్రాలు లేకుండానే కేవలం ఆయస్కాంత శక్తి సాయంతో పట్టాలపై తేలుకుంటూ దూసుకు వెళ్తుంది. అయితే దీన్ని చూసే వారికి మాత్రం అది గాల్లో తేలుతూ నుడుస్తున్నట్లు కనిపిస్తుంది. గంటకు 620 కిమీల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ లోపల ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా సీట్లు వాటి మధ్య ఏర్పాట్లు ఉంటాయి.
ఈ రైలు లోని బోగీలో ఓ పేద్ద ఎల్ఈడీ టీవీ కూడా అమర్చి ఉంటుంది. గత బుధవారం ఆవిష్కరించిన ఈ రైలు నమూనాతో వీటిలోని లోటుపాట్లను పరీక్షించేందుకు, పనితీరును పరిశీలించేందుకు అవకాశం లభించిందని చైనా అధికారులు చెప్తున్నారు. ఇటువంటి వాటిని మాగ్లెవ్ రైళ్లు అంటారు. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లో ఈ రైళ్లు గంటకు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తాయి.