చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో పాటు వృద్ధుల జనాభా పెరుగుతూ, ఈ స్థితి దేశ అభివృద్ధి విషయంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా జనాభా నియంత్రణ చర్యలు తీసుకుంటూ వచ్చినప్పటికీ, ఈ విధానాల ప్రభావం ఇప్పుడు తీవ్రంగా కనపడుతోంది.
యువత ఆర్థిక ఇబ్బందులు, పెళ్లికి దూరంగా ఉండటం వంటి కారణాలతో కొత్త తరాలకు ఆసక్తి తగ్గుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో పిల్లలు లేక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
చైనా విద్యాశాఖ గణాంకాల ప్రకారం, 2023లో 14,808 కిండర్ గార్టెన్ పాఠశాలలు మూతపడ్డాయి, 5,645 ప్రాథమిక పాఠశాలలు తక్కువ విద్యార్థుల సంఖ్య కారణంగా కార్యకలాపాలు ఆపేశాయి.
జననాల సంఖ్య గత ఏడాది 90 లక్షలకు పడిపోవడం విశేషం, 1949 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. 2023లో జనాభా 140 కోట్లకు చేరుకుంది. వృద్ధుల సంఖ్య 30 కోట్లుగా ఉండగా, 2035 నాటికి 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు పెరుగుతుందని అంచనా.
జనాభా సమస్యను అధిగమించేందుకు చైనా పాఠశాలలను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోంది. కానీ దీర్ఘకాలిక పరిష్కారం లేకుండా భవిష్యత్‌లో ఈ సంక్షోభం మరింత తీవ్రతరం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.