కాకినాడ: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహించారు. జనసైనికులు, అభిమానులు భారీగా హాజరైన ఈ సభలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆయన స్పీచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రసంగాన్ని టీవీలో వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనసేన జయకేతన సభలో పవన్ స్పీచ్ ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని పేర్కొన్నారు. జన సంద్రంలానే తన మనసు కూడా ఉప్పొంగిందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ జైత్రయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, జనసేన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కల్యాణ్ ప్రసంగం జనసైనికుల్లో ఉత్సాహాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనపై చిరంజీవి స్పందన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.