ఆంధ్రప్రదేశ్: చిత్తూరు వైసీపీ నేతల గుండెల్లో గుబులు: నెక్స్ట్ ఎవరు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ (YCP) నేతలపై సీఐడీ విచారణ వేగం పుంజుకోవడంతో పార్టీలో ఆందోళన నెలకొంది. లిక్కర్ స్కామ్, మదనపల్లి ఫైల్స్, టీడీఆర్ బాండ్స్ వంటి అవినీతి కేసులు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారు. సీఐడీ విచారణకు హాజరైన ఆయనకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలోని మదనపల్లి, తిరుపతి, వికోట ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు సంబంధితులపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
మదనపల్లి ఫైల్స్ కేసు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)పై మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు అయిన మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ ఉంది తనను అదుపులోకి తీసుకోరని భావించిన మాధవరెడ్డి అరెస్ట్ పెద్దిరెడ్డి వర్గానికి షాక్‌గా మారిందంట. హైదరాబాద్‌లో అతన్ని అదుపులోకి తీసుకోని తర్వాత తిరుపతికి తరలించి చిత్తూరు కోర్టులో హాజరు పర్చారు. ఇప్పటికే పెద్దిరెడ్డి పర్సనల్ సెక్రటరీ తుకారాం (Tukaram) విదేశాలకు పరారైనట్లు తెలిసింది. సీఐడీ ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
నారాయణస్వామిపై విచారణ
అడ్రస్ లేని ఒక కంపెనీ పేరిట నిధుల మార్పిడి జరిగినట్లు గుర్తించి, ఆ కంపెనీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Narayana Swamy)ని విచారించే అవకాశం ఉందని సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఎక్సైజ్ శాఖను నిర్వహించిన నారాయణస్వామిపై లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ దర్యాప్తులో ఆయన పాత్రపై దృష్టి సారించింది. గాలివీడు (Galivedu)కు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారి సత్య ప్రసాద్ (Satya Prasad) కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. నిధుల మార్పిడితో పాటు లిక్కర్ స్కామ్‌లో ఆయన ప్రమేయం ఉన్నట్లు అనుమానం.
నకిలీ ఓటర్ల కేసు
చంద్రగిరిలో నకిలీ ఓటర్లపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy), ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి (Mohit Reddy)పై ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ విచారణలో ఓ ఆర్డీఓ, మాజీ కలెక్టర్ పాత్ర కూడా బయటపడింది.
టీడీఆర్ బాండ్స్ దుర్వినియోగం
తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ దుర్వినియోగంతో నగర పాలక సంస్థకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లింది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి (Abhinay Reddy)పై ఆరోపణలు ఉన్నాయి.
ఆడుదాం ఆంధ్రా కేసు
మాజీ మంత్రి రోజా (Roja)పై ఆడుదాం ఆంధ్రా నిధుల దుర్వినియోగం, టూరిజం శాఖ, ఏపీఐఐసీ భూముల కొనుగోళ్లపై విచారణ సాగుతోంది. విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది.
ఎపిక్ కార్డుల కేసు
తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ ఎపిక్ కార్డుల కేసులో ఐఏఎస్ గీరీషా సస్పెండ్ అయ్యారు. ఈ కేసు భూమన కుటుంబానికి చుట్టుకునే అవకాశం ఉంది.
అటవీ భూముల అక్రమణ
మంగళం పేట, బుగ్గ మఠం భూముల అక్రమణ కేసుల్లో పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ తీవ్రతరం కానుంది.
వైసీపీ క్యాడర్‌లో ఈ కేసులు భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.