అమరావతి: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నెక్సస్ గ్రోత్ సంస్థకు సీఐడీ నోటీసులు
ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో సీఐడీ బృందం మరలా సోదాలు నిర్వహించి, నెక్సస్ గ్రోత్ (NEXUS GROWTH) సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో భాగస్వామ్యంగా ఉన్న నరేష్ అనే మాజీ బ్యాంక్ మేనేజర్, ఖాతాదారుల డబ్బును అనేక అక్రమ మార్గాల్లో నెక్సస్ గ్రోత్ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించారు. నరేష్ ఖాతా నుంచి నెక్సస్ సంస్థకు పెద్ద ఎత్తున డబ్బు బదిలీ జరిగినట్లు సీఐడీ పేర్కొంది.
పరారీలో ప్రభు కిషోర్
నెక్సస్ గ్రోత్ సంస్థను స్థాపించిన ప్రభు కిషోర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నరేష్‌తో పాటు కిరణ్, అజిత్ సింగ్‌లు నెక్సస్ సంస్థకు సంబంధించి పలు లావాదేవీలు జరిపినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. తద్వారా ఈ ముగ్గురి నుంచీ మరిన్ని వివరాలు సేకరించే అవకాశముందని అధికారులు తెలిపారు.
మోసకారి మేనేజర్ నరేష్ అక్రమాలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతినగర్ ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా ఉన్న నరేష్ ఖాతాదారుల నుంచి దాదాపు 28 కోట్ల రూపాయలను మోసం చేసి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం, ఇతర నిధులను కొల్లగొట్టాడు. నరేష్ అక్రమాలకు సంబంధించి బాధితులు వడ్డీ రాకపోవడంతో బ్యాంకు అధికారులను నిలదీయగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.
నరేష్ సెల్ఫీ వీడియోతో మరో చాప్టర్
సెల్ఫీ వీడియోలో నరేష్ తాను ఒక్కడే ఈ మోసానికి పాల్పడలేదని, మరికొంత మంది కూడా ఈ స్కాంలో భాగమని వెల్లడించాడు. ఈ వీడియోతో సీఐడీ విచారణ మరింత వేగవంతమైంది. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా బాధిత ఖాతాదారులకు న్యాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.