టాలీవుడ్: ఒకప్పుడు సినిమాలు హిట్ అయితే వంద రోజులు ఆడేవి, ఫ్లోప్ అయితే ఒక రెండు నుండి మూడు వారాలు ఆడేవి, యావరేజ్ గా ఆడితే ఒక 50 నుండి 70 రోజులు థియేటర్ లలో ఆడేవి. సినిమా అంటే థియేటర్ ఏ తప్ప VCR లాంటివి చాలా తక్కువ మంది దగ్గర ఉండేవి. అప్పట్లో సినిమా పబ్లిసిటీ అంటే వాల్ పోస్టర్లు, టీవీల్లో వచ్చే యాడ్ లు. సినిమా విడుదల అయ్యే టైం లో ట్రైలర్ విడుదల చేసేది. సినిమా టాక్ బాగా లేక పోతే విడుదల అయిన కొన్ని రోజులకే కొద్దీ కొద్దిగా పాటలు టీవీ ల్లో వేయడం, మంచి టాక్ ఉంటే ఇంకొన్ని రోజుల తర్వాత TV లో వేయడం. ఇలా ఉండేది అప్పట్లో సినిమా పబ్లిసిటీ.
ఇప్పుడు పరిస్థితి మారింది. ఫస్ట్ లుక్ లు వచ్చాయి, వాటికి ముందు గా ప్రీ లుక్ లు వచ్చాయి. ట్రైలర్ 1 అని ట్రైలర్ 2 అని ఫీలర్ అని వీటికి ముందుగా టీజర్ అని పిలవబడే రకరకాల పేర్లతో పబ్లిసిటీ అస్త్రాలు తయారు అవుతున్నాయి. ఇదివరకే సినిమాల కోసం తమంతట తామే అభిమానులు థియేటర్లకు వచ్చేవారు. ఇప్పుడు హిట్ సినిమా కూడా 2 – 3 వారాలు ఆడే పరిస్థితే లేదు. అందువల్ల వీలైనన్ని కలెక్షన్లు ఈ మొదటి వారాల్లోనే రాబట్టుకోవడానికి కొత్త రకమైన ప్రచారాలు వస్తున్నాయి.
తమ సినిమాని ఎక్కువ రోజులు జనాల్లో నాన్చడానికి రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. మొన్ననే విశాల్ నటించిన చక్ర సినిమా ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని విడుదల చేసారు.ఈ మధ్య బాచిలర్ హీరోలు తమ రియల్ లైఫ్ లో ఏదో కొత్త అడుగు వేయబోతున్నాం అని ముందుగా హింట్ ఇచ్చినట్టు ఒక పోస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అందరూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కదా వీళ్ళు కూడా ఏదోక అప్డేట్ ఇస్తారు అనుకున్నారు అభిమానులు. తీరా అప్డేట్ వచ్చాక చూస్తే అది సినిమా గురించి వచ్చిన అప్డేట్. ఇవి కొంత వరకు బాగానే ఉంటాయి కానీ ఒక రకంగా విలువల్ని తొక్కి పారేసినట్టే అవుతుంది. చిన్నప్పుడు విన్న పులి కథ లాగ ఇంకో రెండు సార్లు ఇలా చేస్తే నిజంగా పెళ్లి లాంటి అప్డేట్ వచ్చినా కూడా జనాలు పట్టించుకోరేమో.