హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని పలు డిపోల్లో నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రతి డిపో నుంచి 12 బస్సులను మాత్రమే ఆర్టీసీ నడుపుతోంది. అయితే నగరంలో సిటీ బస్సుల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ఇప్పటికే లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు జరుగుతున్నాయి. కానీ నగరంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రత తగ్గకపోవడంతో సిటీ బస్సుల నిర్వహణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. మరోవైపు త్వరలోనే సిటీ బస్సులు కూడా నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సిటీలో రోజూ దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో, నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. షేర్ ఆటోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణించే వారు. కానీ అది ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో షేర్ ఆటోలను ఎక్కువగా ఆశ్రయించట్లేదు. మరోవైపు మెట్రో సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో సిటీ బస్సులు కూడా నడపాలని డిమాండ్ పెరుగుతోంది.