ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ వ్యవస్థలో వినూత్న మార్పులు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల పేరుతో ఓ సందేశాన్ని వినిపించే విధంగా కొత్త విధానం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుతం పింఛనుదారులు వేలిముద్ర ద్వారా తమ సొమ్ము అందుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయంపై అవగాహన కల్పించేందుకు ఏఐ ఆధారిత ఆడియోను ప్రవేశపెడుతున్నారు.
లబ్ధిదారు వేలిముద్ర వేసిన వెంటనే, 20 సెకన్ల పాటు చంద్రబాబు స్వయంగా మాట్లాడినట్టుగా సందేశం వినిపిస్తుంది.
ఈ సందేశాన్ని పూర్తిగా విన్నట్లు ధ్రువీకరించడానికి రెండోసారి వేలిముద్ర పెట్టిన తరువాతే నగదు అందించే విధంగా మార్పు చేస్తున్నారు.
ఇది పింఛను వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రభావం లేని జిల్లాల్లో ప్రారంభమవుతోంది.